Chandrababu | టీడీపీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెన్షన్లు, చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి శనివారం వెళ్లిన చంద్రబాబు నాయుడు.. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేతపై సమీక్షించారు. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత కార్యక్రమాల్లో 48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు టీడీపీ బ్యాక్ ఆఫీస్, ప్రోగ్రామ్ కమిటీకి కీలక ఆదేశాలు జారీ చేశారు.
పెన్షన్లు, చెక్కుల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు కచ్చితంగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సదరు ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కార్యకర్తలు, ప్రజలతో ఎమ్మెల్యేలు మాట్లాడి, వాళ్ల అభిప్రాయాలను తెలుసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం సిన్సియర్‌గా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కూడా కలుపుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. వీటితో పాటు ప్రతి శుక్రవారం టీడీపీ కార్యాలయాల్లో జరిగే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు.