Chandrababu Naidu | కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పేరు ప్రస్తావిస్తేనే నిధులు వచ్చినట్లా అని ప్రశ్నించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన రాష్ట్రానికి నిధులు రానట్లు కాదని తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారని చెప్పారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధులను గరిష్ఠంగా వినియోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కే ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఇదివరకే ఆయా రంగాల్లో పాలసీలను తీసుకొచ్చామని వివరించారు. విభజన కన్నా వైసీపీ పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. ఈ రెండు అంశాలను ఆర్థిక సంఘానికి వివరించి నిధులు కోరతామని తెలిపారు.
సంపద సృష్టించాలి.. అది పేదలకు పంచాలి. రాష్ట్రానికి సంపద దోచుకునేవాళ్లు కాదు.. పంచేవాళ్లు కావాలి. విభజన కంటే ఎక్కువగా గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఏపీ పూర్తిగా దెబ్బతింది. విధ్వంసంతో దెబ్బతిన్న రాష్ట్రానికి చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నా. మన పరిపాలన బాగుంటే కేంద్రం చేయూత… pic.twitter.com/lYc7dG4Bt1
— Telugu Desam Party (@JaiTDP) February 3, 2025
సంపదో దోచుకునే వాళ్లు కాదు.. పంచేవాళ్లు కావాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఏపీ పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంసంతో దెబ్బతిన్న రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మన పరిపాలన బాగుంటే కేంద్రం చేయూత ఇస్తుందని అన్నారు. అప్పుడే ఏపీ అభివృద్ధి పరుగులు తీస్తుందని తెలిపారు. గత వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో జరిగిన విధ్వంసాన్ని ఇప్పుడిప్పుడే చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.