అమరావతి : దుర్గామాతా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు (Indrakiladri) ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandra Babu) దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు (Silk clothes ) సమర్పించారు. నవరాత్రి ఉత్సవాల్భో భాగంగా బుధవారం అమ్మవారు సరస్వతి మాత అవతారంలో దర్శనమిచ్చారు.
ఆలయానికి వచ్చిన చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, సతీమణి బ్రహ్మాణి, మనువడికి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు ఆలయాధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి, అధికారులు పాల్గొన్నారు.
చెడును జయించడమే కాదు మంచిని ప్రోత్సహించి భవిష్యత్లో రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించమని అమ్మవారిని ప్రార్థించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆ ప్రార్థనలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడుకోవాలి, ఆధ్యాత్మిక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఏడురోజుల వరకు ఆలయానికి ఆరులక్షల మంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు. ఉత్సవాల ఏర్పాట్లను పాలకమండలిని అభినందించారు. అమ్మవారి దయవల్ల రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయని అన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాలు, ప్రార్థనా స్థలాల్లో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.