హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): టీడీపీ నేత నారా లోకేశ్ రెడ్‌బుక్ అంశంపై ఏపీ సీఐడీ పోలీసులు తాజాగా లోకేశ్‌కు నోటీసులు జారీచేశారు. రెడ్‌బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. లోకేశ్‌కు నోటీసులు ఇవ్వడానికి అధికారులు గురువారం ఆయన ఇంటికి వెళ్లగా తీసుకోవడానికి నిరాకరించడంతో కోర్టు సూచనల మేరకు శుక్రవారం ఆయనకు వాట్సాప్‌లో పంపించారు.
నోటీసులు అందుకున్నట్లు లోకేశ్ ధ్రువీకరించారు. లోకేశ్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉల్లంఘించడం, కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశారని, వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పేర్కొనడాన్ని సీఐడీ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.