అమరావతి : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు జారీ చేశారు. దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజరవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు సూచించారు. తనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ధృవీకరించిన ఎంపీ.. విచారణకు తాను హాజరుకావడం లేదని స్పష్టం చేశారు.
ఏపీ సీఐడీ పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసు ఇచ్చారు. దిల్కుషా అతిథిగృహంలో నిర్వహించే విచారణకు రావాలని ఆయనకు సూచించగా.. ఆయన విచారణకు హాజరయ్యేది లేదంటూ స్పష్టం చేశారు. దీనిపై ఈ నెల 16 వ తేదీనే సమాధానం ఇచ్చానని, మరోసారి విచారణకు హాజరుకావాల్సిన అవసరం తనకు కనిపించలేదన్నారు. హైదరాబాద్‌లో విచారణకు తనతో పాటు రెండు వార్తా చానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. తనకు ఒక్కడికే నోటీసు ఇవ్వడం కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఎంపీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లగా.. అక్కడ సీఐడీ పోలీసుల తనపై దాడి చేశారని ఎంపీ ఆరోపించారు. దీంతో గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘురామపై ఎలాంటి గాయాలు లేవిని వైద్యులు నివేదిక ఇచ్చారు. అనంతరం వైద్య పరీక్షల విషయంలో ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సికింద్రాబాద్ ఆర్మీ దవాఖానలోకు తరలించాలని ఆదేశించింది. అప్పుడు రఘురామకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో విచారించేందుకు ఏపీ సీఐడీ నోటీసు ఇవ్వగా.. హైదరాబాద్‌లోనే విచారించేలా ఆదేశించాలని కోరుతూ రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఏపీ సీఐడీ పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ తాజాగా నోటీసు ఇచ్చారు.