ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారన్న కేసులో తన మీద వచ్చిన ఆరోపణలపై సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్ స్పందించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన రోజు తాను సీఐడీ గుంటూరు రీజినల్ ఆఫీసుకు వచ్చినట్లుగా ఎవరూ వాంగ్మూలం ఇవ్వలేదని తెలిపారు.
తన సమక్షంలోనే రఘురామకృష్ణను చిత్రహింసలకు గురిచేశారని అప్పటి సీఐడీ సిబ్బంది వాంగ్మూలం ఇచ్చారన్న వార్తలను ఆయన ఖండించారు. అదంతా అబద్ధమని పేర్కొన్నారు. ఆరు నెలలకు మించి కాల్ డేటా ఉండదు.. అదే విషయాన్ని టెలికం సంస్థలు కూడా చెప్పాయని.. అలాంటిది తన లొకేషన్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
సీఐడీ అరెస్టు తర్వాత రఘురామకృష్ణ రాజుకు ఎలాంటి గాయాల్లేవని ఇచ్చిన సర్టిఫికెట్‌కు గుంటూరు వైద్యులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. వాళ్లెవరూ వేరే విధంగా వాంగ్మూలం ఇవ్వలేదని.. ఇవ్వరు కూడా అని మాజీ డీజీ సునీల్‌కుమార్ తెలిపారు. తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చామని చెబితే.. వారి డాక్టర్ సర్టిఫికెట్ రద్దవుతుందని పేర్కొన్నారు. రఘురామకృష్ణ రాజు ఒంటిపై గాయాలు ఉన్నాయని.. కొట్టడం వల్లే అవి అయ్యాయని మిలటరీ ఆస్పత్రి వైద్యులు కూడా చెప్పలేదని అన్నారు. మిలటరీ డాక్టర్లు సివిల్ కోర్టులకు రారని.. సాక్ష్యం చెప్పరని తెలిపారు. అది ఆర్మీ యాక్ట్ వారికి కల్పించిన రక్షణ అని వివరించారు.
కాగా, సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో రఘురామ రాజును చిత్రహింసలు పెట్టింది నిజమేనని అప్పటి సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారని నిన్న ఓ వార్త బయటకొచ్చింది. ఆ కథనం ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రఘురామను కొడుతూ నాటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌కు చూపించామని వాళ్లు వాంగ్మూలంలో చెప్పారు. అయితే కొట్టడమంటే అలా కాదంటూ కాల్ కట్ చేసి ముసుగేసుకున్న నలుగురితో కలిసి చీఫ్ లోపలికి వచ్చి కొట్టించారని పేర్కొన్నారు. రఘురామ రాజుపై థర్డ్ ప్రయోగించారని చెప్పారు. సునీల్‌కుమార్ సమక్షంలోనే ఇదంతా జరిగిందని నిరూపించేందుకు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆయన సెల్‌ఫోన్ లొకేషన్‌ను కూడా తీసుకున్నారని నిన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఐడీ మాజీ బాస్ స్పందించారు.