Elections | ఎన్నికల్లో ఓటు వేశామా లేదా అనేది తెలుసుకునేందుకు రుజువు సిరా గుర్తు! దొంగ ఓట్లు పడకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు.. చూపుడు వేలుపై ఈ సిరాను అద్దుతారు. ఈ సిరా గుర్తు అంత తొందరగా చెరిగిపోదు. అయితే సార్వత్రిక ఎన్నికల వేళ ఈ సిరా గుర్తుపై ఒక ప్రచారం వైరల్గా మారింది. ఓటు వేసిన తర్వాత పూసే ఈ సిరా బయట అందుబాటులో ఉందని.. దీన్ని ఓటర్ల ఇంటి వద్దే వాళ్ల చూపుడు వేలిపై రాసి ఓటు హక్కు వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర జరుగుతుందని సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పందించారు.
చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉండదని ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ సిరా కేవలం భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే కాకుండా అందరికీ ఈ సిరా అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.