AP Cabinet Meeting | ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లుల అంశాలపై చర్చించేందుకు ఏపీ మంత్రివర్గం శుక్రవారం నాడు సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా నాలా ఫీజు రద్దుకు సంబంధించిన చట్టాలను సవరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటిని తాడిగడప మున్సిపాలిటీగా సవరణకు ఆమోదం తెలిపింది. రాజధానిలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మునిసిపాలిటీ యాక్ట్ 1965లకు ప్రజాప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
రాజధాని పరిధిలో గతంలో 343 ఎకరాల భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. ఏపీ జీఎస్టీ బిల్లు 2025లో పలు సవరణల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర కింద రూ.15వేలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించింది.