AP News | టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరి 6వ తేదీన రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇవ్వలేదని అప్పట్లో వైసీపీ నాయకులు ఆరోపించారు. దీంతో అదే ఏడాది ఫిబ్రవరి 12 మరోసారి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు.
ఇంతకాలంగా పెండింగ్‌లో ఉన్న గంటా రాజీనామాను.. తాజాగా స్పీకర్ ఆమోదించారు. గంటా శ్రీనివాసరావు ఆమోదంపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, రాపాక వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ తమ్మినేని నోటీసులు జారీ చేశారు. ఏపీలో త్వరలోనే మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో సీఎం రమేశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్ పదవీకాలం ముగియనుంది. ఆ స్థానాలకు తొందరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే జాగ్రత్త పడ్డ వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.