Ramacharyulu | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పంపారు. ఆయన వైఎస్సార్సీపీ అనుకూల అధికారి అనే ఆరోపణలున్నాయి. అలాగే, శాసనసభ నిర్వహణలో రామాచార్యుల వైఖరిపై పలు విమర్శలున్నాయి. ఇటీవల స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడి ఎన్నిక సమయంలో అసెంబ్లీ ప్రసారాలపై పలు టీవీ ఛానెల్స్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఫైల్‌ను సిద్ధం చేయడంలోనూ ఆయన వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశమైంది. స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు తొలి సంకం చేసే ఫైలుపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని.. మూడు ఛానెల్స్‌పై నిషేధం ఎత్తివేసే అంశాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారనే ఆరోపణలున్నాయి.
గత ప్రభుత్వం హయాంలో రామాచార్యుల నియామకం జరిగింది. ఆయన పదవీకాలం పూర్తయినా కొనసాగిస్తూ వచ్చింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రిటైర్ అయినా కొనసాగుతున్న అధికారులంతా రాజీనామా చేయాలని కూటమి సర్కారు ఆదేశిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది. దాంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామాను శాసన మండలి చైర్మన్ మోసెన్ రాజు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి అందజేశారు. మరో వైపు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.