అమరావతి : ఏపీలో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ(YCP) కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు రాజీనామా బాట పడుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేసిన 48 గంటల్లో మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు.
శుక్రవారం ఏలూరు జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (Alla Nani) వైసీపీకి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైఎస్ జగన్(YS Jagan) కు రాజీనామా లేఖ(Resign) ను పంపించారు. కొన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆళ్ల నాని 1994, 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు శాసనసభ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయాడు. 2019లో పోటీ చేసి గెలుపొందడంతో వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. మొన్నటి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యాడు.