హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమలలో ఏర్పాటుచేసిన బోనులో మరో చిరుత చిక్కింది. దీంతో ఇప్పటివరకు అటవీ అధికారులు ఐదు చిరుతలను బంధించారు. కాలినడక మార్గంలో గురువారం ఉదయం మొదటి ఘాట్‌రోడ్డు ఏడో మైలు నరసింహస్వామి ఆలయ సమీపంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో ఆ చిరుత చికింది. ఇప్పటివరకు నడక మార్గంలోనే చిరుతలను గుర్తించగా, తాజాగా తిరుమలలోనే ఒక చిరుత సంచరించిన విషయం కలకలం రేపింది.
అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన కెమెరాల ద్వారా చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిరుతలను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు, ఈ విషయంలో రాజీపడేది లేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 300 మంది అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతున్నదని తెలిపారు.