తిరుమల : ఆపద మొక్కులవాడు, కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిపై ఎంతో నమ్మకంతో తిరుమలకు (Tirumala) వచ్చే భక్తులకు స్వామివారి సేవలు మరింత చేరువ చేసేందుకు టీటీడీ నూతన పాలక మండలి ((TTD Board) కీలక నిర్ణయం తీసుకుంది.
టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు (Chairman BR Naidu) అధ్యక్షతన సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు. భక్తులకు నిత్య అన్న ప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు భక్తులు వేచి ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ (Artificial Inteligence) ఉపయోగించి 2, 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు అవకాశముంటుందని తెలిపారు.
ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం
బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10 శాతం పెంచాలని టీటీడీ నిర్ణయించిందని చైర్మన్ వెల్లడించారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535, బ్రహ్మోత్సవ బహుమానం కింద అందించనున్నట్లు ప్రకటించారు.
శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్న ప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ చేసుకోనున్నామని, ఈ పనులను టీవీఎస్ సంస్థ ఉచితంగా చేయనుందని ఆయన అన్నారు.