Anna Konidela | ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా కొణిదెల ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామికి ఆదివారం తలనీలాలు సమర్పించారు. సింగపూర్ నుంచి కొడుకు మార్క్ శంకర్, భర్త పవన్ కల్యాణ్‌తో కలిసి శనివారం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆదివారం అన్నా తిరుమల పర్యటనకు వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం వద్ద ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అక్కడే టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీవారి తలనీలాలు సమర్పించుకున్నారు. అంతకు ముందు వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరాహ స్వామి వారి దర్శనం అనంతరం పద్మావతి కల్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు.
ఇక సోమవారం వేకువజామున వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తారని, సుప్రభాత సమయంలో స్వామి వారిని దర్శించుకుంటారని జనసేన పార్టీ తెలిపింది. టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందిస్తారని, తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరిస్తారని వివరించింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 8న సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడ్డ విషయం తెలిసిందే. పాఠశాలలో సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న సమయంలో ప్రమాదం జరిగింది. మార్క్ శంకర్‌తో పాటు మరికొంతమంది విద్యార్థులు గాయపడగా.. ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనలోనే మార్క్ శంకర్ చేతులకు గాయాలు కాగా.. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరి అస్వస్థతకు గురయ్యాడు. సింగపూర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించగా కోలుకున్నాడు. తనయుడు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ఆమె తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించినట్లు జనసేన పార్టీ వివరించింది.