AP Elections | జమిలి ఎన్నికలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్లో 2027లోనే ఎన్నికలు వస్తాయని తెలిపారు. అంటే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. అందుకే కూటమి పార్టీ నేతలకు అనుకూలంగా ఉండవద్దని అధికారులకు సూచించారు. టీడీపీ నేతల మాటలు వింటే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపైనా కాకాణి మండిపడ్డారు. మద్యం టెండర్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వైన్ షాపుల కేటాయింపులో 90 శాతం టీడీపీ నేతలకే దక్కాయని అన్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ కొనసాగిందని అన్నారు. అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని మండిపడ్డారు. నిబంధనలన్నీ పేపర్లకే పరిమితమయ్యాయని విమర్శించారు. కలెక్టర్లు సైతం ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారని అన్నారు.
వైన్ షాపుల్లో మొత్తం ఎల్లో సిండికేట్దే దందా అని కాకాణి విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇసుక, గ్రానైట్, విద్య, వైద్యంలో సిండికేట్ రాజ్యం కొనసాగుతోందని.. యథేచ్ఛగా దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ముందస్తు ప్రణాళికలతో దోచుకోవడంలో చంద్రబాబు నేర్పరి అని ఎద్దేవా చేశారు. ఎల్లో బ్యాచ్ బాగుకోసమే మద్యం పాలసీని ప్రకటించారని అన్నారు. ఇప్పుడు వైన్ షాపుల కేటాయింపు తర్వాత అదే తేటతెల్లమయ్యిందని చెప్పారు.
లిక్కర్ షాపుల కేటాయింపులో సీఎం చంద్రబాబు మూడంచెల దోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని కాకాణి విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులతో కింది స్థాయి నాయకులు దోచుకుంటారని ఆరోపించారు. అందుకే వైన్ షాపుల డ్రాలో.. అవి ఎక్కడ ఉండాలనేది ప్రకటించలేదని చెప్పారు. ఇకపై మద్యం రేట్లతో పాటు విక్రయ వేళల్ని కూడా నాయకులే నిర్ణయిస్తారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకే వచ్చి చేరిందని అన్నారు. కానీ ఇప్పుడు కూటమి పార్టీల పాలనలో లిక్కర్ సిండికేట్లు ఆ ఆదాయాన్ని పంచుకుంటారని అన్నారు.