అమరావతి : సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో వేసిన భోగిమంటలు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. తీవ్ర గాయాలతో ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఘటన ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్నది. అమలాపురం పరిధిలోని గొల్లివిల్లిలోని విజ్డమ్ పాఠశాలలో ఈ నెల 12 నుంచి పాఠశాలలకు సెలవులు కావడంతో బుధవారం వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేయగా.. విద్యార్థులంతా కేరింతలు కొడుతుండగా.. సిబ్బంది మంటలపై పెట్రోల్ చల్లినట్లుగా సమాచారం. దీంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిపడడంతో ముగ్గురు విద్యార్థులకు మంటలు అంటుకున్నాయి.
ఈ ఘటనలో రెండో తరగతికి, మూడో తరగతికి చెందిన ఇద్దరు బాలికలు, యూకేజీ చదువుతున్న బాలుడు తీవ్రగాయాలకు గురయ్యారు. వారిని అమలాపురంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధ, కలెక్టర్ ఆసుపత్రికి వెళ్లి.. వారి తల్లిదండ్రులను పరామర్వించారు. మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థులకు పొట్టభాగం, కాలికి గాయాలయ్యాయని, ప్రాణాలకు ప్రమాదం లేదని పేర్కొన్నారు. అయితే, పాఠశాలలో భోగి మంటలు వేయడం ఇదే తొలిసారని పాఠశాల డైరెక్టర్ రాంబాబు చెప్పారని ఎంఈవో పేర్కొన్నారు. గాయపడిన పిల్లలకయ్యే ఖర్చును పాఠశాల డైరెక్టరే భరిస్తారని వివరించారు.