AP News | ఏపీలోని అనకాపల్లిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మురంగా గాలింపు చర్యలు చేపట్టారు. 20కి పైగా బృందాలతో బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో ఉండి మరీ నిందితుడి కోసం వెతుకుతున్నారు. అయితే నిందితుడు ఫోన్ వాడకపోవడంతో ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో గతంలో ఎవరెవరితో మాట్లాడాడో కాల్ డేటా ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వైజాగ్ జైలులో ఉన్న సమయంలో ఎవరితో పరిచయాలు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడు ఘటనాస్థలిలో ఓ లేఖను విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ పుస్తకంలో నిందితుడు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖ ప్రకారం.. మైనర్ బాలికను హత్య చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉంటే ఇద్దరం కలిసి ఉండాలని.. లేదంటే చనిపోవాలని లేఖలో నిందితుడు పేర్కొన్నట్లు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. బాలిక కుటుంబసభ్యుల గురించి కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని సురేశ్ ఆ లేఖలో రాశాడు. అలాగే లేఖ చివరలో అందరూ క్షమించండి అని రాసినట్లు ఎస్పీ చెప్పారు. దీంతో నిందితుడు సురేశ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాంబిల్లి మండల పరిధిలోని అన్ని చెరువులు, కుంటల దగ్గర కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో నిందితుడు సురేశ్ తన అమ్మమ్మగారి ఊరైన కొప్పుగొండుపాలెంలోనే ఎక్కువగా పెరిగాడు. ఐటీఐ పూర్తి చేసి.. చాలా రోజులు ఖాళీగా ఉన్నాడు. ఆ సమయంలోనే చెడు అలవాట్లకు బానిసైనట్లు తెలుస్తోంది. కొంతకాలం డ్రైవర్‌గా పనిచేసి మానేశాడు. ఫార్మాసిటీలోని ఓ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా కూడా పనిచేశాడు. ఈ క్రమంలోనే కొప్పుగొండుపాలెం గ్రామానికి చెందిన బాలిక దర్శినిపై సురేశ్ కన్నేశాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. పెళ్లి చేసుకుంటానని వెంటపడేవాడు. దీంతో బాలిక తన తల్లిదండ్రుల సాయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన సురేశ్.. బాలికను హత్య చేశాడు.