AP News | ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తమ ఇంటి మీద నుంచి వెళ్తూ ఓ కోతి ఒక ప్యాకెట్ పడేసి వెళ్తే.. అది టీ పొడి అనుకుని ఓ వృద్ధ మహిళ దాంతో టీ పెట్టింది. తాను కొంచెం తాగడమే కాకుండా భర్తకు కూడా ఓ కప్ ఇచ్చింది. అయితే కోతి పడేసింది విష గుళికల ప్యాకెట్ కావడంతో వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని పల్లికడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (70), వెలుచూరి అప్పాయమ్మ (68) భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. పిల్లల పెళ్లిళ్లు అవ్వడంతో ఇంటి దగ్గర ఇద్దరే ఉంటున్నారు. ఈ క్రమంలో గోవిందు ఇంటి దగ్గర ఓ కోతి శుక్రవారం నాడు గుళికల ప్యాకెట్‌ను పడేసింది. ఆ ప్యాకెట్‌ను టీ పొడి ప్యాకెట్‌ను అని భావించి దాంతో టీ పెట్టింది. భర్త గోవిందుతో పాటు తాను కూడా ఆ గుళికలతో పెట్టిన టీ తాగింది. ఆ తర్వాత కాసేపటికే నోటి నుంచి నురగలు కక్కుతూ పడిపోయారు.
దంపతులు ఇద్దరూ పడిపోవడం గమనించిన స్థానికులు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ రాత్రి మరణించారు. పల్లికడియం గ్రామంలోనే ఉంటున్న గోవిందు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, గతంలో ఓ కోతి ఇలాగే తమ ఇంటి దగ్గర ఓ ప్యాకెట్ పడేసి వెళ్లిందని.. అప్పుడు అప్పాయమ్మ ఇంట్లోకి తీసుకెళ్లి టీ పెట్టుకుందని తెలిపింది. ఇప్పుడు కూడా టీ పొడి ప్యాకెట్‌నే పడేసి ఉంటుందని భావించి టీ పెట్టుకుని ఉంటారని చెప్పింది.