Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు చేగొండి హరిరామజోగయ్య మరోసారి లేఖ రాశారు. రెండో విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ సమావేశమయ్యారు. ఏ సీటును ఎవరికి కేటాయించాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక సూచలను చేస్తూ పవన్ కళ్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ రాశారు. ప్రధానంగా రెండో జాబితాలో బలిజ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాలని లేఖలో సూచించారు.
రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని.. ఈ నియోజకవర్గాల్లో 20 లక్షల మంది వరకు బలిజ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారని ఈ సందర్భంగా పవన్‌కు హరిరామజోగయ్య తెలిపారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బలిజలకు సీటు కేటాయించలేదని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. బలిజలకు జనసేన సీట్లు కేటాయించాలని సూచించారు. మదనపల్లి నుంచి శ్రీరామాంజనేయులు, తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులు, రాజంపేట నుంచి ఎంవీ రావు, అనంతపురం నుంచి టీసీ వరుణ్, పుట్టపర్తి నుంచి బ్లూమూన్ విద్యాసంస్థల అధినేత శివశంకర్, తంబళ్లపల్లి నుంచి కొండా నరేంద్ర, గుంతకల్లు నుంచి మణికంఠకు టికెట్ల కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.