అమరావతి : సోషల్ మీడియాలో (Social Media) అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న జనసేన నాయకులపై కూటమి ప్రభుత్వం (Alliance government ) చర్యలు తీసుకుని నిజాయితీని చాటుకోవాలని వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి( Divvela Madhuri) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం వైసీపీ కార్యకర్తలతో కలిసి టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో సీఐని కలిసి వీడియోలతో కూడిన ఆధారాలను సమర్పించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోంమంత్రి అనిత మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెట్టే ఏ పార్టీలో ఉన్న వారైనా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వారిపై నమ్మకంతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై (MLC Duvvada Srinu), తనపై, వైసీపీ కార్యకర్తలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రెండు సంవత్సరాల క్రితం పవన్‌కల్యాణ్‌పై దువ్వాడ శ్రీను చేసిన వ్యాఖ్యలపై కక్షపూరితంగా నేడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. జనసేన నాయకులు, కార్యకర్తలు తమపై నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారని, ఇంటికొచ్చి చంపివేస్తున్నామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని ఇచ్చిన హామీని నిరూపించుకోవాలని కోరారు.