అమరావతి : రాబోయే ఎన్నికల్లో జనసేన తరుఫున పోటీకి ఆసక్తి చూపుతున్న ఆ పార్టీ నాయకులకు టికెట్ రాకపోతే ప్రజాశాంతి పార్టీలో చేరుతారని కేఏ పాల్( KA Paul ) పేర్కొన్నారు. తాను విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తనను ఎంపీగా గెలిపిస్తే అంగన్వాడీ(Anganwadis) లను పర్మినెంట్ చేస్తానని, వాలంటీర్లకు రూ.20 వేల జీతం ఇస్తానని వెల్లడించారు.
ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ నమ్మకద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల (Sharmila) పాదయాత్ర చేయకపోతే జగన్ అధికారంలోకి వచ్చేవాడు కాదని ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కావాలో, అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే తాను కావాలో ప్రజలు తేల్చుకోవాలని విశాఖ ప్రజలను కోరారు.
విశాఖ బొత్స ఝాన్సీ పోటీ చేస్తే వారి కుటుంబ అవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరించారు. ఏపీలోని అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉంటే భారత రత్న వచ్చేదని, ఆయన భారత రత్న ఇవ్వకపోవడం విచారకరమని పాల్ అన్నారు.