AP News | టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల విషయంలో ఇంకా సయోధ్య కుదరడం లేదు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పొత్తుల అంశంలో చిచ్చు లేపే విధంగా టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు రెండేండ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జనసేన, బీజేపీకి కేటాయించిన సీట్లలో ఎలా సర్దుబాటు చేసుకుంటారో అది వాళ్లిష్టమని అన్నారు. తాను మాత్రం రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
టీడీపీ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఇప్పుడు పార్టీలో అగమ్యగోచరంగా మారింది. గతంలో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ పొత్తుల్లో భాగంగా రాజమండ్రి రూరల్ సీటును తమకు కేటాయించాలని జనసేన పట్టుబడుతుంది. జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌కు రాజమండ్రి రూరల్ టికెట్ ఇవ్వాలని జనసేన అధిష్ఠానం భావిస్తోంది. ఈ విషయం ఇప్పుడు టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టికెట్లు ఆశించి చాలామంది టీడీపీలో చేరుతున్నారని.. కానీ ఒరిజినల్ టీడీపీ లీడర్లకు అన్యాయం జరగదని పేర్కొన్నారు. అసలే సీట్ల పంపకాలపై స్పష్టత రాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్న సమయంలో గోరంట్ల బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.