Srisailam | కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతున్నది. కార్తీక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రద్దీ రోజులలో స్వామి వారి గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు శ్రీశైలం ఈవో ఆజాద్ తెలిపారు. భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా అమ్మవారి అంతరాలయంలో జరిపించే కుంకుమార్చనలు కూడా ప్రాకార మండపంలోనే నిర్వహిస్తున్నారు. యాత్రికులు కూడా ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో ఆజాద్ కోరారు.
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులతో క్షేత్రం సందడి సందడిగా మారింది. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామ స్మరణతో మార్మోగుతున్నది. కార్తీక మాసం ఆఖరి వారం కావడంతోపాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి అమ్మవార్ల ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, అతి శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతున్నదని ఆలయ అధికారులు చెప్పారు. దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులకు అమ్మవారి ఆలయం వెనుక భాగంలో కూడా ప్రసాద వితరణ చేస్తున్నారు.
దర్శనానంతరం ఆదివారం మధ్యాహ్నం నుండి తిరుగు ప్రయాణమైన వాహనాలతో శ్రీశైల క్షేత్ర పరిధిలో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబద్ రహదారి వైపు నిలిచి పోయిన
వాహనాలు క్లియర్ అవ్వడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందని వాహనదారులు అన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఆంక్షలు కఠిన తరం చేశారు. టోల్ గేట్ నుండి రింగ్ రోడ్డు మీదుగా భక్తులు నిర్ణీత ప్రాంతాలకు వెళ్లవలసిందిగా సూచించారు. క్షేత్ర పురవీదుల్లోకి ప్రవేశించి అడ్డగోలుగా పార్కింగులు చేసి యాత్రికులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండేలా పలు కూడళ్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తున్నట్లు శ్రీశైలం సిఐ ప్రభాకర్, ఆలయ భద్రతా అధికారి సాములు తెలిపారు.