Madhavilatha | సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాధవీలతను ప్రాస్టిట్యూట్ అని పరుష పదజాలం వినియోగించడంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలను మాధవీలత మరిచిపోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ ఫేస్బుక్లో మాధవీలత ఒక వీడియో పోస్టు చేశారు. నార్మల్గా ఉండటానికి చాలా ట్రై చేశా.. కానీ నాతో అవ్వడం లేదంటూ చెబుతూనే వెక్కి వెక్కి ఏడ్చేశారు.
‘ చాలా ప్రయత్నం చేశా.. కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి.. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతిక్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం.. అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి.’ అని మాధవీలత అన్నారు. ఎన్నోసార్లు ఎందరో తన ఆత్మవిశ్వాసాన్ని చిదిమివేయాలని ప్రయత్నం చేశారని.. పదే పదే ఇవే మాటలన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నా పార్టీ ( ప్రజల) కోసం, మహిళల కోసం హిందూ ధర్మం కోసం మాతరమే నిస్వార్థంగా నా వంతు పోరాడుతున్నానని మాధవీలత తెలిపారు. రూపాయి తీసుకున్నది లేదు.. ఎవరికీ ద్రోహం చేసింది లేదు.. మోసం చేసింది లేదు.. కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారని వాపోయారు. ఆడపిల్లగా ఎప్పుడూ నేను సింపథీ గేమ్ ఆడలేదని.. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించలేదని పేర్కొన్నారు. మగాడిలా పోరాడుతూనే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ కష్టాలను అధిగమిస్తానని తెలిపారు. తన ధైర్యాన్ని కోల్పోనని పేర్కొన్నారు. తన కుటుంబంతో పాటు అభిమానులు, సోషల్మీడియాలో ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారని చెప్పారు. నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమించండి. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు నాకు శక్తినిస్తాయని వ్యాఖ్యానించారు.