Posani Krishna Murali | టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది. దాంతో ఆయనను గుంటూరు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో సీఐడీ హాజరు పరిచింది. ఈ సందర్భంగా పోసానిని న్యాయమూర్తి విచారణ సక్రమంగా జరిగిందా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అని ప్రశ్నించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని.. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరిగిందని పోసాని బదులిచ్చారు. ఆ తర్వాత సీఐడీ అధికారులను ఆయనను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు ఒకరోజు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే.
విచారణ తర్వాత గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేసి.. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. అంతకు ముందు ఆయనను దాదాపు నాలుగు గంటల పాటు అధికారులు విచారించారు. అయితే, పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు తెలుస్తున్నది. అనేక అంశాలపై సీఐడీ పోలీసులు ఆయనను విచారించారు. అయితే, విచారణకు సమయం సరిపోలేదని.. మరికొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయని.. ఈ క్రమంలో మరోసారి కస్టడీకి ఇస్తే విచారణ పూర్తి చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది. సీఐడీ కేసులో బుధవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనున్నది.