అమరావతి : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు (YS Jagan) చెందిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో (Social Media) పోస్టింగ్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) డిమాండ్ చేశారు.
శుక్రవారం గుంటూరు పట్టాభిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జై టీడీపీ ట్విట్టర్ (Twitter) పేజీలో వైసీపీ నాయకులను అవమానించే విధంగా మంత్రి నారా లోకేష్ సృష్టించిన రోబో సీమరాజు అనే వ్యక్తి వైసీపీ (YCP) కండువా వేసుకుని పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ పోస్టులతో మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని సీఐ నుంచి డీజీపీ స్థాయి వరకు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సతీమణి భారతి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే ప్రైవేటు కేసులు వేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని హెచ్చరించారు.
కూటమి నాయకులకు భయపడే ప్రసక్తేరాదని వెల్లడించారు. గత నెలలో ఫిర్యాదు చేసిన వాటిపై పోలీసులు ఇంతవరకు కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. టీడీపీ సోషల్ మీడియాపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు. జగన్కు సన్నిహితంగా ఉన్న వాళ్లపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.