తిరుపతి : తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికల పోలింగ్లో అధికార వైసీపీ తీరుపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎలాంటి ఎన్నికలైనా అక్రమాలకు పాల్పడడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లోనూ వైసీపీ అడ్డదారులు తొక్కుతుందని, టీడీపీ నేతలను గృహ నిర్బంధించి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నికలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
పోలీసులు ఉన్నది అధికార పక్షానికి కొమ్ముకాయడానికా అని నిలదీశారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులను బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులను బయటకు లాగేసి అక్రమాలు చేస్తున్నారని , దొంగ ఐడీ కార్డుతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. దొంగ ఓట్లు అడ్డుకుంటామనే టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా సార్వత్రిక ఎన్నికల్లో జగన్కు ఓటమి తప్పదని హెచ్చరించారు.