Cyber Crime | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకు కార్డు నంబర్లు, ఓటీపీలు తెలుసుకొని నగదు కాజేసిన ముఠాలు.. ఇప్పుడు బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్‌తో ఖాతాలను కొల్లగొడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాలు అధికవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ప్రకారం గత ఆరు నెలల్లో దాదాపు 4 వేల కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇలాంటి ముఠాలు అత్యధికంగా హర్యానాలో కేంద్రీకృతంగా కాగా.. మరికొన్ని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి దందా సాగిస్తున్నట్టు ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా సైబర్ పోలీసుల విభాగం గుర్తించింది. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు ఎవరో విత్‌డ్రా చేసుకొన్నట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో యూపీకి చెందిన అంతర్రాష్ట్ర సైబర్ నేరస్థుల ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసును ఛేదించిన కడప పోలీసులు.. 14 మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేశారు. విశాఖపట్నంలో నమోదైన ఇదే తరహా కేసులోనూ హర్యానాలోని 40 మంది సభ్యుల ముఠా దందా వెలుగుచూసింది.
సైబర్ నేరగాళ్లు వివిధ వెబ్సైట్ల నుంచి వ్యక్తుల వేలిముద్రలను ‘బటర్ పేపర్’పై కాపీ చేస్తారు. రిజిస్ట్రేషన్లు, ట్రెజరీ, ఇతర ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు, ఆన్లైన్ రికార్డుల్లో నమోదైన వేలిముద్రలను కాపీచేస్తారు. అనంతరం క్లోనింగ్ ద్వారా నకిలీ సిలికాన్, రబ్బరు వేలిముద్రలు తయారుచేస్తారు. ఆధార్ నంబర్ అనుసంధానమైన వ్యక్తుల పేరిట ఫేక్ డాక్యుమెంట్లతో ఆన్లైన్ బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. దీంతో బాధితుల అసలైన ఆన్లైన్ ఖాతాలు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌లు నేరగాళ్ల నియంత్రణలోకి వస్తాయి. అనంతరం క్లోనింగ్ చేసిన వేలిముద్రలను ఉపయోగించి ఖాతాల్లోని నగదును కొల్లగొడతారు.
బ్యాంకు ఖాతాదారులతోపాటు ప్రభుత్వ సంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.