విజయవాడ: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఇంటిపై ఏసీబీ దాడిచేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించినట్లు తెలుస్తున్నది
విజయవాడ రూరల్ అంబాపురంలో సర్వే నెంబర్లు మార్చేసి, అగ్రిగోల్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే ఆయనపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న జోగి రమేశ్ కుటుంబసభ్యులు ఉండగా, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిందితులుగా ఉన్నట్లు తెలుస్తున్నది. మొత్తం 9మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, గతంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసుతోపాటు అగ్రిగోల్డ్ భూవివాదం విషయంలోనూ జోగి రమేష్‌పై కేసులు ఉన్నాయి. భూ వివాదంపై గత నెలలోనే డీజీపీ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది.