IPS Sanjay | ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా పని చేశారు. ఆ సమయంలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద అనుమతి కోరుతూ సీఎస్‌కు ఏసీబీ అధికారులు లేఖ రాయగా.. అందుకు సీఎస్ ఆమోదం తెలిపారు. దాంతో సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా సంజయ్, ఏ 2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, ఏ 3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ను చేర్చారు.
డీజీగా ఉన్న సమయంలో సంజయ్ నిరభ్యంతర పత్రాలు ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్నిఎన్వోసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి-నిర్వహణ, 150 ట్యాబ్‌లు సరఫరా కాంట్రాక్ట్‌ను సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షలు, సీఐడీ తరఫున ఎస్సీ, ఎస్టీ, ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల కోసం నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు రూ.1.19 కోట్లు చెల్లించారు. ఆయా సదస్సులన్నీ సీఐడీ అధికారులు నిర్వహించగా.. క్రిత్వ్యాప్ సంస్థ సదస్సులు నిర్వహించకపోయినా బిల్లుల పేరుతో దోపిడీకి పాల్పడ్డారని.. దాంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2కోట్ల వరకు నష్టం కలిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. ఆయా నివేదికల ఆధారంగా ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయగా.. తాజాగా ఏసీబీ కేసు పెట్టింది.