AB Venkateswara Rao | ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనేది తన ఉద్దేశమని.. పదవులపై ఎలాంటి ఆశ లేదని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను ప్రజల ముందుంచుతానని తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన ‘కోడికత్తి’ ఘటన నిందితుడు శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదివారం వెంకటేశ్వరరావు పరామర్శించారు. అనంతరం అమలాపురంలో విలేకరులతో మాట్లాడారు. రిటైర్మెంట్ సమయంలోనే కాళ్లు, చేతులు సక్రమంగా ఉన్నంత వరకు సమాజం కోసం పని చేస్తానని చెప్పానని.. ఈ మేరకు రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్‌తో తనకు ఎలాంటి కక్ష్యలు లేవని.. ఆయన చేయాల్సింది చేశారని.. తాను చేయాల్సిన పోరాటం చేశానన్నారు. వివాదాల అధ్యాయం ముగిసిందని.. ఇదో కొత్త అధ్యాయమన్న ఆయన.. జగన్ అక్రమాలను వదిలిపెట్టేది లేదన్నారు.
మాజీ సీఎం అరాచకాలను బయటకు తెస్తామని.. ఆయన అక్రమ ఆర్థిక సామ్రాజ్యం సండూర్ పవర్‌తో మొదలై ఇప్పుడు లక్షల కోట్లకు చేరిందన్నారు. ఆ కంపెనీలోకి ఖాతాలోకి విదేశాల నుంచి నగదు చేరిందని.. అదంతా ప్రజల డబ్బేనన్నారు. దోచుకున్న సొమ్మును చట్టపరంగా కక్కిస్తామన్నారు. జగన్ హయాంలో కోడికత్తి శ్రీనులాంటి బాధితులు వేలల్లో ఉన్నారని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లుగా టెర్రరిస్టులపై పెట్టే కేసులన్నీ శ్రీనుపై పెట్టారని ఆరోపించారు. ఆరేళ్లు బెయిల్ రాకుండా జీవితాన్ని అంధకారంలోకి నెట్టారని.. జగన్ కోసం బలైన మొదటి వ్యక్తి అతనేనన్నారు. ఇలాంటి బాధితులకు సహాయం అందించి.. వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తానన్నారు. జగన్ బాధితులకు ఎవరైనా 7816020048 వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చన్నారు. జగన్‌తో ఏపీకి ప్రమాదమని.. ఆయన పాలనలో రాష్ట్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతిందని విమర్శించారు. ఐదేళ్లలో ఆయన చేసిన విధ్వంసం అంతా ఇంత కాదన్న ఏబీ.. విలువైన సమయం సైతం వృథా అయ్యిందన్నారు. ప్రజలను కులాలు, వర్గాలుగా విడదీస్తారన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.