AP News | ఆంధ్రప్రదేశ్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలను మరువకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ సెంటర్కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలికపై నిర్వాహకుడు అత్యాచారానికి యత్నించాడు. భయాందోళనలకు గురైన ఆ బాలిక పెట్టిన కేకలకు స్థానికులు స్పందించడంతో దారుణం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం నార్పల మండలం కేంద్రంలోని మసీదు సమీపంలో నాగరాజు (45) జిరాక్స్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. అదే మండలానికి చెందిన ఎనిమిదో తరగతి దళిత విద్యార్థిని ఆధార్ కార్డు జిరాక్స్ కోసం అక్కడికి వెళ్లింది. ఒంటరిగా రావడాన్ని గమనించిన నిర్వాహకుడు నాగరాజు విద్యార్థిని లోపలికి రా అని పిలిచాడు. అలాగే లోపలికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ హఠాత్పరిణామంతో బెంబేలెత్తిపోయిన బాలిక గట్టిగా కేకలు పెట్టింది. అరుపులు విన్న స్థానికులు అక్కడకు వచ్చి బాలికను రక్షించారు. జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు నాగరాజుకు దేహశుద్ధి చేశారు.
అనంతపురం జిల్లాలో అత్యాచారయత్న ఘటనపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వైసీపీ తీవ్రంగా మండిపడింది. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్గా మారిందని విమర్శించింది. మొన్న నంద్యాల, నిన్న విజయనగరం, నేడు అనంతపురం బాలికలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు నాగరాజుకు దేహశుద్ధి చేస్తున్న వీడియోను పోస్టు చేసింది.
జిరాక్స్ సెంటర్కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై అత్యాచార యత్నం చేసిన నిర్వాహకుడు
అనంతపురం – శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై నిర్వాహకుడు నాగరాజు అత్యాచార యత్నం చేశాడు
బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో రక్షించిన… pic.twitter.com/yNtgrSXxUQ
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2024
కాగా, నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. వారం రోజులైనా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నిందితులు రోజుకోరకంగా సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఆరు నెలల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ రెండు ఘటనలు ఏపీలో సంచలనం సృష్టించడంతో హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం స్పందించారు. ఈ రెండు కేసుల్లో బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. తప్పు చేసింది ఎవరైనా సరే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అలాగే ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు, విజయనగరం బాధిత చిన్నారికి రూ.5లక్షలను సాయంగా ప్రకటించారు.