అమరావతి : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ( Kashibugga) వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు ( Investigation) జరపాలని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana) డిమాండ్ చేశారు.
వైసీపీ నాయకులు పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు మరికొందరు నాయకులు కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించి ,బాధితులకు అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొక్కిసలాట జరగడం మూడోసారి ఆరోపించారు. సింహాచలం, తిరుపతి, కాశీబుగ్గ ఆలయాల్లో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పొయ్యారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలని, తిరుపతి, సింహాచలం ఘటనలపై ఎవరిపై చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
సనాతన ధర్మం చెప్పే నాయకుడు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరని దుయ్యబట్టారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని కోరారు.