అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ( Amaravati ) పై అసెంబ్లీలో తీర్మానం పెట్టినంత మాత్రన చట్టబద్ధత రాదని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని( Perninani ) అన్నారు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవసరం లేదా ? అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశంలో రాజధాని చట్టబద్ధతపై తీర్మానం చేసిన అంశంపై ఆయన స్పందించారు. అమరావతి చట్టబద్ధత పేరుతో అసెంబ్లీలో ఆరుగంటల పాటు చంద్రబాబు పెద్ద డ్రామా చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
అమరావతి చంద్రబాబుకు ఏటీఎంగా పనికి వస్తోందని ఆరోపించారు. అమరావతి కోసం ఇప్పటి వరకు 21 వేల కోట్లు ఖర్చుచేశారని, తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం, హైకోర్టుకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలోనే అమరావతిలో రోడ్ల నిర్మాణాలు జరిగాయని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్కు అమరావతిపై కోపం లేదని, కోపం ఉంటే తాడేపల్లిలో ఇల్లు ఎందుకు కట్టుకుంటారని ప్రశ్నించారు. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు రద్దు చేశారని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని తీర్మానం పెట్టాలని కోరారు.