అమరావతి : అన్నపూర్ణ రాష్ట్రంగా వెలుగొందే ఆంధ్రప్రదేశ్‌లో క్రాప్ హాలిడేగా ప్రకటించిన వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించే సమయం ఆసన్నమయ్యిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan ) పేర్కొన్నారు. కోనసీమ (Konaseema) జిల్లా మండపేటలో బుధవారం నిర్వహించిన వారాహి విజయయాత్రలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంలో రాయితీలు (Agriculture subsidies) తీసేసిన వైసీపీకి రైతులు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. జగన్ (Jagan) పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే కూటమి లక్ష్యమని అన్నారు.
ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి దళారుల దోపిడీ అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే నిధులను జగన్ దారి మళ్లించి ఇతర పథకాలకు వాడుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ధాన్యం పండించే రైతులకు లాభాలు లేవని గంజాయి(Ganja) పండించే వారికి దండిగా లాభాలు వస్తున్నాయని విమర్శించారు. గంజాయి పండించే వైసీపీ నాయకులకు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వంద రోజుల్లోనే గంజాయి గూండాలను ఉక్కుపాదంతో నలిపేస్తామని హెచ్చరించారు. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొట్టి ప్రజల భవిష్యత్‌ను కాపాడుతామని అన్నారు.