(women set on fire) ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న వారిలో విభేదాలు రావడంతో.. మహిళను నిప్పంటించాడో ఘనుడు. అయితే, ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. సదరు యువకుడికి కూడా తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం.
జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల గ్రామంలో నివసించే ఓ మహిళకు గతంలోనే వివాహమైంది. అయితే, భర్తతో గొడవల కారణంగా విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. రాజుకు గతంలో వివాహమై.. భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు. దాంతో ఇద్దరూ సహజీవనం చేయసాగారు. ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. పట్టరాని కోపంతో అక్కడే ఉన్న పెట్రోల్‌ను మహిళపై పోసి నిప్పంటించాడు. ఈ మంటలు రాజుకు కూడా అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. వీరి అరుపులు విన్న స్థానికులు వెంటనే వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్ధితి విషమంగా ఉండటంతో ఆమెను కావలి ఏరియా దవాఖానకు తరలించారు. రాజును ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.