AP News | ఉగాది పర్వదినాన ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు యత్నించాడు. ఓ గుడి ముందు గుంత తీసుకుని అందులో కూర్చుని వారం రోజులుగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. తెలుగు సంవత్సరం నాడే శివైక్యం అవ్వాలని అనుకున్నాడు. కానీ పోలీసులు వచ్చి బలవంతంగా బయటకు తీసుకురావడంతో తన ఆలోచన నుంచి విరమించుకున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి సజీవ సమాధి కావాలని ఇటీవల నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పన్నెండ్ల క్రితం ఊరి శివారున ఉన్న తన పొలంలో తాను సొంతంగా నిర్మించిన భూదేవి ఆలయ ఆవరణలోనే సజీవ సమాధి కావాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆలయం ముందు వారం క్రితం పెద్ద గుంత తవ్వి అందులోకి దిగి పైన రేకు కప్పుకున్నాడు. అందులోనే ఉండి ధ్యానం చేస్తున్నాడు.
ఉగాది పర్వదినాన సజీవ సమాధి కావాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కోటిరెడ్డి తన కుమారిడో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం గుంతలో దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అప్పుడు అతని కుమారుడు ఆ గుంతపై పెద్ద రేకు ఉంచి, దానిపై మట్టిపోసి పూడ్చివేశాడు. విషయం తెలుసుకున్న కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి, మరికొందరు అక్కడకు చేరుకుని బయటకు రావాలని అడిగాడు. కానీ తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి సూచించాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని గ్రామస్తులు అడగ్గా.. ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని, కులమతాలు లేకుండా అందరూ ఐకమత్యంతో మెలగాలని కోరుకుంటూ దీక్ష తీసుకుని సజీవ సమాధి అవుతున్నానని కోటిరెడ్డి తెలిపాడు. దీంతో చేసేదేమీ లేక అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో కోటిరెడ్డిని బయటకు తీసుకొచ్చారు. కానీ పోలీసులు వెళ్లిపోయిన వెంటనే మళ్లీ కోటిరెడ్డి ఆ గుంతలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. కుటుంబసభ్యులు, స్థానికులు మళ్లీ చాలాసేపు బతిమిలాడటంతో బయటకొచ్చిన కోటిరెడ్డి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇదంతా ప్రచారం కోసం చేస్తున్న ప్రయత్నమేనని ఎస్సై మల్లిఖార్జున రావు తెలిపారు. కోటిరెడ్డి ఆరోగ్యంగానే ఉన్నాడని పేర్కొన్నారు.