(Man with Axe) అమరావతి: గొడ్డలి చేతిలో పట్టుకుని సచివాలయంకు వచ్చిన ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తన భార్యతో ఉద్యోగానికి రాజీనామా చేయిస్తావా? లేకా చస్తావా? తేల్చుకో అంటూ ఓ అధికారిపై విరుచుకుపడ్డాడు. తాగిన మైకంలో అధికారిపైకి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. చివరకు అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి ఎందుకలా గొడ్డలితో వచ్చి హంగామా చేశాడంటే..
కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడుకు చెందిన చిరుమామిళ్ల సుబ్బారావు అనే వ్యక్తి భార్య సచివాలయంలో వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ గత కొంతకాలంగా సుబ్బారావు తన భార్యపై ఒత్తిడి తెస్తున్నాడు. అతడి మాటల్ని పెడ చెవిన పెడుతూ ఎప్పటిమాదిరిగానే ఉద్యోగానికి వస్తున్నది. దాంతో సుబ్బారావు కోపం నషాలానికి అంటుకున్నది.
గొడ్డలితో నేరుగా సచివాలయానికి వచ్చిన సుబ్బారావు.. అక్కడి అధికారులపై చిందులేశాడు. తన భార్యతో ఉద్యోగానికి రాజీనామా చేయించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చాడు. అలా చేయకపోతే గొడ్డలితో నరికేస్తానంటూ బెదిరించాడు. మద్యం సేవించి ఉండటం, గొడ్డలితో వచ్చి హల్చల్ చేయడంతో అక్కడి సిబ్బంది భయపడిపోయారు. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు సచివాలయం ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లింగాలపాడుకు వచ్చి సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు.