AP News | ఫాదర్స్ డే నాడే దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రియులతో రొమాన్స్‌కు అలవాటు పడిన ఓ యువతి.. తనకు అడ్డుగా ఉన్నాడని కన్నతండ్రినే హత్య చేసింది. చివరకి దొరికిపోవడంతో కన్నతండ్రే తనపై లైంగికవేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేక చంపేశానని అభాండం మోపింది. కానీ ఆమె మాటలు నమ్మకుండా పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దొరస్వామి (62) స్థానిక జీఆర్టీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య స్నేహ రెండేళ్ల క్రితం మరణించింది. అప్పట్నుంచి ఒక్కడే కూతురు హర్షిత (25) ఆలనాపాలనా చేసుకుంటున్నాడు. హర్షిత ఇప్పటికే బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసింది. దీంతో కూతురికి పెళ్లి చేసి తన బాధ్యతలు తీర్చుకోవాలని దొరస్వామి ఆశపడ్డాడు. ఒక సంబంధం కూడా చూశాడు.
కూతురికి కట్నంగా ఇచ్చేందుకు రూ.80 లక్షలు పెట్టి రెండంతస్తుల భవనాన్ని కూడా దొరస్వామి కొనుగోలు చేశాడు. దాన్ని కూడా కుమార్తె పేరుమీదనే రిజిస్టర్ చేయించాడు. అన్ని విధాల అనుకూలమైన సంబంధం దొరకగానే పెళ్లి చేసేద్దామని అనుకున్నాడు. కానీ అనూహ్యంగా రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. చుట్టుపక్కల వాళ్లకు పెద్దగా కేకలు వినపడటంతో ఇంట్లోకి వచ్చిచూసేసరికి దొరస్వామి రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దొరస్వామి హత్యకు గురైన సమయంలో కూతురు హర్షిత ఒక్కతే ఉండటంతో పోలీసులు ఆమెను విచారించారు. ఏమైందని ఆరా తీయగా ముందుగా.. ఇంట్లోకి ఎవరో వచ్చారని, తన తండ్రిని హత్య చేశారని చెప్పింది. కానీ ఆమె సమాధానం పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు గుచ్చిగుచ్చి అడగ్గా తానే హత్య చేశానని ఒప్పుకుంది. అయినా సరే తప్పించుకునేందుకు తన తండ్రి.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోనే ఈ పనిచేశానని బుకాయించింది. కానీ అది కూడా నమ్మని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది.
తల్లి చనిపోవడం, తండ్రి ఉద్యోగానికి వెళ్లడంతో హర్షితకు ఎక్కువగా ఫ్రీడమ్ దొరికింది. విచ్చలవిడి తనానికి అలవాటు పడింది. ఇద్దరితో ప్రేమాయణం సాగించింది. ఇద్దరు ప్రియులు కూడా రోజూ ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వాళ్లు విషయాన్ని దొరస్వామికి చెప్పారు. కుమార్తె గురించి తెలుసుకున్న దొరస్వామి.. హర్షితను మందలించాడు. వెంటనే ఆమెకు పెళ్లి చేసి ఆమె జీవితాన్ని బాగు చేయాలని అనుకున్నాడు. అందుకే తొందరగా సంబంధాలు చూడటం మొదలు పెట్టాడు. కానీ ఇద్దరు ప్రియులతో స్వేచ్ఛకు అలవాటు పడిన హర్షిత పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో తండ్రీకూతుళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తండ్రిని హత్య చేసేందుకు ఒక ప్రియుడికి రూ.10 లక్షల సుఫారీ కూడా ఇచ్చింది. కానీ హత్య మాత్రం తానే చేశానని హర్షిత ఒప్పుకుంది. తన తండ్రి నిద్రలో ఉన్నప్పుడు చపాతీల కర్ర, ఇనుప రాడ్డుతో కొట్టి చంపానని పోలీసులకు చెప్పింది. అయితే హత్య జరిగిన తీరు చూస్తే మాత్రం ఒక్కరే చేసినట్టు కనిపించడం లేదని పోలీసులు భావిస్తున్నారు. హర్షితకు ప్రియులు సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో హత్య ఎలా జరిగిందనేది క్లారిటీ రావాల్సి ఉంది.