అమరావతి : ప్రకాశం బ్యారేజ్ (Prakasam barrage ) గేట్లను బోట్లు (Boats) ఢీకొన్న ఘటనపై పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఘటనపై విచారణ జరపాలని నీటిపారుదలశాఖ ఈఈ కృష్ణారావు విజయవాడ ఒకటవ టౌన్లో ఫిర్యాదు చేశారు. బోట్ల యజమానులను విచారించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
గత సోమవారం రోజున కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి నాలుగు ఇనుప బోట్లు కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయిట్ తగలడంతో అవి దెబ్బతిన్నాయి. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్ స్వల్పంగా దెబ్బతినగా.. 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి.
అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. గేట్ల వద్ద ఉన్న బోట్లను తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు.