అమరావతి : ఏపీ పోలీసులను దూషించిన కేసులో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై (Kakani Goverdhan Reddy) నెల్లూరు జిల్లా కావలి టౌన్ పోలీసులు (Kavali Police) కేసు నమోదు చేశారు. ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నె లో టీడీపీ, వైసీపీ (YCP) వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారూ గాయపడడంతో వారిని కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలోనే వైసీపీ శ్రేణులు మరోసారి కత్తులతో రెచ్చిపోయారు. వైసీపీ నేతలను పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు వచ్చిన కాకాణి గోవర్దన్ రెడ్డి పోలీసులు, టీడీపీ (TDP) నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ శ్రేణులు తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు సహకరిస్తున్నారని కాకాణి ఆరోపించారు.
ఏపీలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, పోలీసు అధికారులు సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వారినీ వదిలేది లేదంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత వంటేరు ప్రసన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు.