అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి (CEO) ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో పోలింగ్ వివరాలను వెల్లడించారు. 80.66 శాతం ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగగా పోస్టల్ బ్యాలెట్ (Postal Ballort) ద్వారా వచ్చిన శాతాన్ని కలిపితే 81.86 శాతం రాష్ట్రం నమోదయ్యిందని వివరించారు.
రాష్ట్రంలో 2014 సంవత్సరంలో 78.41 , 2019లో 79.77 శాతం పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. దాదాపు రెండు శాతం పోలింగ్ పెరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 4,13,33,702 మంది ఓటర్లు ఉండగా వీరిలో 3,33,40,560 మంది పార్లమెంట్‌కు, 3,33, 40,333 మంది అసెంబ్లీకి ఓటు వేశారని ఆయన తెలిపారు. దర్శి (Darsi) అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 పోలింగ్, ఒంగోలు (Ongle) లో 87.06 పోలింగ్ శాతం నమోదయ్యిందని చెప్పారు. అత్యల్పంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 63.32, వైజాగ్ పార్లమెంట్ స్థానానికి అత్యల్పంగా 71.11 శాతం పోలింగ్ జరిగిందన్నారు.
స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రత
రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల ఈవీఎం యంత్రాలను 33 కేంద్రాలు, 350 స్ట్రాంగ్‌రూం (Strong room) లో భద్రపరిచామని ఆయన వివరించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని మీనా తెలిపారు. పోలింగ్ రోజున 9 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి వారిని అరెస్టు చేసి రెండురోజుల్లో వారిని జైలులో పెడతామని వెల్లడించారు.
పోలింగ్ అనంతరం తాడిపత్రి మాచర్ల, చంద్రగిరి, నరసారావుపేట జరిగిన హింసాత్మక ఘటనలపై సీరియస్‌గా తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ నియోజకవర్గాల్లో 144 సెక్షన్, అదనపు బలగాలు మోహరించామని పేర్కొన్నారు. అభ్యర్థులను సైతం హౌజ్ అరెస్టు చేశామని ఆయన వివరించారు.