తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రెండు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం 8 గంటల్లో అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న 71,496 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 26,908 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.33 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో దాసహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న యువ ధార్మికోత్సవం ముగిసింది. బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రాఘవేంద్రచార్యులు మాట్లాడుతూ చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత, దైవభక్తి కలిగి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు.
పిల్లలకు తల్లిదండ్రులు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లోని పలు అంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు.