అమరావతి: ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. క్రితం రోజుతో (434) పోలిస్తే మంగళవారం కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 22,267మందికి కరోనా పరీక్షలు చేయగా.. 615మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్‌తో నలుగురు చనిపోయారు.
చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనాతో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అదే సమయంలో ఒక్కరోజే 2,787 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 23,13,827. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,86,575. రాష్ట్రంలో 12వేల 550 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య 14,702 కు పెరిగింది. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 3,28,69,245 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
నిబంధనలు అతిక్రమిస్తే..
రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ కొవిడ్ నిబంధనలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలన్నది. మాస్కు ధరించని వారికి రూ.100 జరిమానా విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాణిజ్య ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించని వారికి రూ.25 వేలు జరిమానా విధించనున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉండనున్నాయి.