అమరావతి : గుంటూరు జిల్లా అన్నపర్రున బీసీ హాస్టల్ విద్యార్థులు (BC students ) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సుమారు 47 మంది విద్యార్థులు ఆసుపత్రులపాలు కాగా మరికొందరు చికిత్స అనంతరం వారివారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ హాస్టల్లో మొత్తం 106 మంది విద్యార్థులుండగా రెండు రోజులుగా కొంతమంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. 47 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనుకావడంతో వారిని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై ఏపీ మంత్రి సవిత ( Minister Savitha) ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని వెల్లడించారు. దీంతో పెదనందిపాడు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థులను అధికారులు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు. ఆహారం శాంపిళ్లకు పంపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయలక్ష్మి, తహసీల్దార్ హేనా ప్రియ, డిప్యూటీ తహసీల్దార్ కరిముల్లా, ఇన్చార్జి హెచ్ఎం చంద్రశేఖర్ అక్కడి సేవలను పర్యవేక్షించారు. 5గురు విద్యార్థులకు జ్వరం తీవ్రంగా ఉండడంతో వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.