ఎన్టీఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నది. ఎక్సైజ్, పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ.. స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటూ అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్లు, జేసీబీలతో ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్జీఆర్ జిల్లా మైలవరం మండలంలో పెద్ద ఎత్తున మద్యంను తొక్కించారు. ఒక్క మైలవరం మండలంలోనే 46 వేలకుపైగా మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారంటే.. అక్రమ మద్యం ఎంతగా సరఫరా అవుతుందో అర్ధం చేసుకోవచ్చు.
ఎన్జీఆర్ జిల్లా మైలవరం పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్న 46,180 మద్యం బాటిళ్లను ఊరు చివర రోడ్డుపై పడేసి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఇవన్నీ ఒక్క మైలవరం మండలం పరిధిలో స్వాధీనం చేసుకున్నవే. తిరువూరు రోడ్డులో నందనవనం లేఅవుట్ వద్ద రోడ్డు రోలర్‌తో మద్యం సీసాలను పేర్చి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విలువ కోటికిపైగా ఉంటుందని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ నారాయణస్వామి, ఏసీపీ ప్రసాద్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్యంపై పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది ఉక్కు పాదం మోపుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి అక్రమంగా తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం పట్టుకుంటున్నారు.
మైలవరం, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండేండ్ల వ్యవధిలో 933 మద్యం అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. విజయవాడ సీపీ కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు మొత్తం 46,180 మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఈ మద్యం విలువ సుమారు రూ.కోటికి పైగానే ఉంటుందని.. భవిష్యత్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. మద్యం తరలిస్తూ పట్టుబడితే జైలు శిక్ష కూడా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.