Srisailam | శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుండి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుండి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో శనివారం డ్యాం పది గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టు నుండి 2,45,750 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 17,782 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 1,67,556 క్యూసెక్కుల (మొత్తం 4,33,088 క్యూసెక్కులు ) నీరు శ్రీశైలానికి విడుదల చేశారు.
శనివారం సాయంత్రం వరకు రిజర్వాయర్‌లోకి 4,24,466 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరినట్లు శ్రీశైలం అధికారులు తెలిపారు. అదే విధంగా పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తులో తెరచి 4,61,560 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 61,761 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు.
రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు 882.50 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వలు 215.807 టీఏంసీలకుగాను 202.0439 టీఏంసీలుగా నమోదైంది. అదేవిధంగా డ్యాం గేట్లు తెరవడంతోపాటు వారంతపు సెలవులు రావడంతో హైదరాబాద్ ఘాట్ రోడ్డు మొత్తం 4 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తాయి. కృష్ణమ్మ పరవళ్ళ అందాలను చూస్తూ యాత్రికులు సెల్ఫీలు తీసుకుంటూ ఆనంద పరవశులవుతున్నారు.