కర్నూలు: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Bus Accident) అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ( DD01N9490) పల్సర్ బైకును ఢీకొట్టింది. 300 మీటర్ల దూరం బైకును అలాగే తీసుకెళ్లింది. దీంతో బైకు ట్యాంక్ పేలడంతో బస్సు కింద ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి వ్యాపించడంతో క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాలను ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. మంటల్లో పూర్తిగా కాలిముద్దగా మారడంతో మృతదేహాలు గుర్తుపట్టలేకుండా పోయాయి. దీంతో పోస్టుమార్టం, డీఎన్ఏ పరీక్షల తర్వాత మృతదేహాలను గుర్తించనున్నారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. వారిలో 21 మంది క్షేమంగా బయటపడ్డారు.