తిరుపతి : అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో తిరుపతి, తిరుమలలో భక్తులు, స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు కాలినడక మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. శనివారం కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. భక్తుల భద్రత ప్రధానమంటూ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా రాత్రి రెండో ఘాట్ మార్గంలో 18 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి . చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా కపిలతీర్థం, తిరుమల బైపాస్రోడ్డుపై కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ స్తంభించిపోయింది. తిరుమల ఆలయ పరిసరాలు, మాడవీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల్లోకి నీరు చేరి.. చెరువును తలపించింది.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరద, బురద నారాయణగిరి వసతి సముదాయంలోకి చేరింది. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి. మొదటి కనుమ రహదారిలో మాత్రమే భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. పాపవినాశనం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లోనూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను సైతం మూసివేశారు. వర్షం వల్ల టూరిజం హోటల్ గోడ కూలి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.