హైదరాబాద్: అంటుకట్టు సాంకేతికతతో కూరగాయల అధిక దిగుబడి సాధించవచ్చని ఇక్రిశాట్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. (Vegetable grafting technology) అధిక దిగుబడినిచ్చే వంగడాన్ని సహజమైన వెంటిలేటెడ్ పాలీహౌస్ (ఎన్వీపీహెచ్) సాగుతో అంటుకట్టడం వల్ల ఉత్పాదకత పెరుగడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవచ్చని నిరూపితమైంది. ఫ్రాంటియర్స్ ఇన్ అగ్రోనమీలో ఈ పరిశోధన కథనాన్ని ప్రచురించారు. పాలీహౌస్ వాతావరణ పరిస్థితులలో పెరిగిన అంటుకట్టిన టమోటా మొక్కలపై (సోలనమ్ టోర్వమ్ రూట్స్టాక్పై సియోన్) దృష్టి సారించారు. బహిరంగ క్షేత్రాల్లో అంటుకట్టని మొక్కలతో వాటిని పోల్చారు. దీంతో ఎన్వీపీహెచ్ పద్ధతితో అంటుకట్టిన టమోటాలు 63.8 శాతం ఎక్కువ దిగుబడి వచ్చింది. అలాగే 3 నుంచి 5 వరకు అదనపు పంటలు ఇచ్చింది.
కాగా, వంకాయ, మిరపకాయ, దోసకాయ, పుచ్చకాయలు వంటి ఇతర కూరగాయలు, పండ్ల మొక్కలపై కూడా ఈ సాంకేతికతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలతో కలిసి రైతులకు శిక్షణ ఇస్తున్నారు. అధిక దిగుబడులతో రైతుల జీవితాలు మారడంతోపాటు పోషకాహారం, జీవనోపాధి, ఆహార స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
కూరగాయల అంటుకట్టు పద్ధతి చిన్న రైతులకు గేమ్ ఛేంజర్ అని ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (రీసెర్చ్, ఇన్నోవేషన్) డాక్టర్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్ తెలిపారు. ఈ విధానం ద్వారా దిగుబడితోపాటు లాభాలను పెంచడమే కాకుండా, వ్యవస్థ స్థితిస్థాపకతకు ఉపయోగపడుతుందని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు.
వాతావరణ వైవిధ్యాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలలోనూ కూరగాయల పెంపకంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అంటుకట్టు పద్ధతి ఎలా సహాయపడుతుందో తమ అధ్యయనం స్పష్టం చేసిందని ఇక్రిశాట్ రెసిలెంట్ ఫార్మ్ అండ్ ఫుడ్ సిస్టమ్స్, తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ రమేష్ సింగ్ తెలిపారు.
ప్రారంభంలో టమోటాలపై దృష్టి సారించినప్పటికీ, అభివృద్ధి చేసిన అంటుకట్టు పద్ధతిని వంకాయ, మిరప, దోసకాయ, పొట్లకాయ, పుచ్చకాయలతో సహా విస్తృత శ్రేణి కూరగాయల పంటలకు అన్వయించవచ్చని ఈ వినూత్న పరిశోధనకు కారణమైన ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రోహన్ ఖోపడే వివరించారు.
మరోవైపు విభిన్న వ్యవసాయ వ్యవస్థలలో ఉత్పాదకతను పెంచే సామర్థ్యాన్ని ఈ సాంకేతికత అన్వయిస్తుందని ఇక్రిశాట్ వ్యవసాయ రంగంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గజనన్ సావర్గాంకర్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ రైతులకు గణనీయమైన ప్రయోజనాలు అందించిందని, కూరగాయల ఉత్పాదకత 30 శాతం నుంచి 150 శాతం వరకు పెరిగిందని వివరించారు.